Tunnel Aquarium in Hyderabad : భాగ్యనగర సిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం నిర్మించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శుక్రవారం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. బిడ్‌ను దక్కించుకున్న సంస్థకే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో 30 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారు.
ప్రపంచ స్థాయి హంగులతో నగరంలో అక్వేరియం..: ఇప్పటికే హిమాయత్‌సాగర్ సమీపంలో కొత్వాల్‌గూడ వద్ద 150 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఎకో పార్కును అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఐదు ఎకరాల్లో భారీ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై మెరైన్ పార్కు, అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో ఈ తరహా అక్వేరియంలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు.. వాటి కంటే భిన్నంగా ప్రపంచస్థాయి హంగులతో కొత్వాల్‌గూడలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లు సమర్పించాలని గడువు విధించారు. మొదట సాంకేతిక బిడ్లను పరిశీలించి, తర్వాత ప్రైస్ బిడ్ తెరచి, అర్హత ఉన్న సంస్థను ఎంపిక చేస్తారు. పనులు దక్కించుకున్న సంస్థ వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
వంద మీటర్ల పొడవుతో ఏర్పాటు..: అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వీటి లోపలికి వెళ్లే పర్యాటకులకు సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా సముద్రం, నదుల నుంచి తెచ్చే నీటిని నింపేందుకు మూడు వేల మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో వేయి రకాల సముద్ర జీవులను పెంచడంతో పాటు.. షార్క్‌లు, డాల్ఫిన్లు వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు కల్పించనున్నారు.
అక్వేరియంలో బంగీజంప్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ అంశాలు..: నగరంలో నిర్మిస్తున్న ఈ అతిపెద్ద అక్వేరియం లోపల రెస్టారెంట్, డోమ్ థియేటర్, 7డీ, వీఆర్ థియేటర్లు ఇతర ఆధునిక హంగులతో దీనిని నిర్మించనున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక హాళ్లు అందుబాటులో ఉండేలా రూపొందించనున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడే ఒకట్రెండు రోజులు గడిపేందుకు వీలుగా సమీపంలోనే చెక్కతో కాటేజీలను ఈ అక్వేరియంలో నిర్మించనున్నారు. కొండ ప్రాంతం కావడంతో బంగీజంప్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ అంశాలను అదనంగా జోడించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: