75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని.. రాష్ట్రప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. నగరంలోని చారిత్రాత్మకమైన భవనాలను విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించింది. దీంతో నగరం సరికొత్త కళను రూపుదిద్దుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులను వీక్షిస్తూ.. నగరవాసులు మురిసిపోయారు. నగరంలో అసెంబ్లీ, బీఆర్కే భవనాలతో పాటు... గోల్కొండ కోటను రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోయాయి. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం విద్యుత్ సౌధ వెలుగులతో విరాజిల్లింది. హుస్సేన్ సాగర్ అందాలు సందర్శకులను కట్టిపడేశాయి.
వేడుకల్లో భాగంగా తీర్చిదిద్దిన నగర అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని గొల్కొండ, చార్మీనార్, లుంబిని పార్క్, బీఆర్‌కె భవన్, అసెంబ్లీ ఇలా అన్నీ ప్రాంతాల్లోని ప్రముఖమైన కట్టడాలను వీక్షించి... సాయంత్రం హుస్సేన్ సాగర్ పరిసరాల అందాలను వీక్షిస్తూ... కుటుంబసమేతంగా సంతోషంగా గడిపారు. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహంతో పాటు.. బోట్లకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం మరింత శోభను సంతరించుకుంది.
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో... నగరానికి చూసేందుకు వచ్చామని సందర్శకులు చెబుతున్నారు. సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ అందాలు అద్భుతంగా ఉన్నాయని... కితాబిస్తున్నారు.
ఇదీ చూడండి: చెరిపేస్తే చెరిగేదా చరిత్ర- 'ఖుదీరామ్ బోస్' భరతమాత ముద్దుబిడ్డ!