హైదరాబాద్‌లో పలు బస్తీల జనాన్ని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. చెరువులు పొంగి కాలనీల్లోకి చేరిన నీరు బయటికి వెళ్లే మార్గం లేక వారం నుంచి లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ఉంటున్నాయి. వనస్థలిపురం పరిధిలోని హరిహరపురం కాలనీ వాసులు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారు. ఇళ్ల మధ్య నిలిచిన నీటిని తక్షణం తోడేసి... పారిశుద్ధ్య పనులు చేపడితేనే తమ కుటుంబాలు క్షేమంగా ఉంటాయని స్థానికులు వేడుకుంటున్నారు.
బైక్‌ను విడిచి
హయత్ నగర్ పరిధిలోని మునగనూరు నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా అందులో పడి కొంచెం దూరం కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వరద తాకిడికి వాహనంతో సహా కిందపడ్డారు. వెంటనే బైక్‌ను విడిచి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఎగువన ఉన్న ఇంజాపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద వస్తోంది.
అప్రమత్తంగా ఉండాలని
నీళ్లు వెళ్లిపోయిన కాలనీల్లో పారిశుద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న సర్కార్ ఆదేశాలతో యంత్రాంగం చర్యలు చేపట్టింది. సరూర్‌నగర్ సమీప ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు రసాయనాలు పిచికారీ చేశారు. పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోనల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆదేశించారు. నగర ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన సూచించారు.
సరూర్ నగర్ చెరువు కట్టపై ఉన్న గంగమ్మ తల్లికి స్థానికులు శాంతి పూజ నిర్వహించారు. వరద విపత్తు తొలగిపోయి..ప్రజలందరినీ క్షేమంగా చూడాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి : నీటమునిగిన ఇళ్లు.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు