Fact Check Conference in OU: వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ సూచించారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా జర్నలిజం విభాగం సంయుక్తంగా ఓయూ సీఎఫ్ఆర్డీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మోయర్ పాల్గొన్నారు. దురుద్దేశం లేకపోయినా.. దురదృష్టవశాత్తు కొన్ని సార్లు చట్టబద్ధమైన మీడియా సంస్థల నుంచే తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుందని పేర్కొన్నారు. మీడియా అందించిన సమాచారం అధారంగానే ప్రజలు అభిప్రాయానికొస్తారని వివరించారు.
సమాచార సముద్రంలో ఈదుతున్న పాత్రికేయులు కొన్ని సందర్భాల్లో అసత్యానికి, వాస్తవానికి వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని మోయర్ అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలను అందించేందుకు ముందుకొచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగాన్ని డేవిడ్ మోయర్ అభినందించారు.
ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం అత్యవసరమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. దీనికి ఉస్మానియా జర్నలిజం విభాగం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి సదస్సులు.. బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడతాయని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
వాస్తవ సమాచారాన్ని జల్లెడ పట్టడానికి క్లిష్టమైన ఆలోచనా పద్దతులను వర్తింపజేయాలని డేటాలీడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ నజాకత్ అన్నారు. టెక్నికల్ టూల్స్‌పై అతిగా ఆధారపడటం కన్నా... పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం మంచిదని బూమ్ లైవ్ దక్షిణాది న్యూస్ ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ జర్నలిస్టులకు సూచించారు. తప్పుడు సమాచారం, అభిప్రాయం, హాస్యాలకు.. వ్యత్యాసం ఏమిటో గుర్తించాలన్నారు. ఏదైనా సమాచారానికి సంబంధించి.. అది అబద్ధమా, లేదా సందర్భం మారిందా, వ్యంగమా గమనించాలన్నారు. కేవలం వైరల్ అయిన సమాచారానికి మాత్రమే కాకుండా.. ప్రతి చిన్న సమాచారానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమని వివరించారు. ఓయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె.నరేందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కె.స్టీవెన్ సన్, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.. జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సదస్సులో ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ప్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని డేవిడ్ మోయర్‌తో కలిసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ విడుదల చేశారు. 90 గంటల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జాతీయ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్ హాజరయ్యారు. ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా సురేశ్, ప్రాజెక్ట్ సభ్యుడు ఎస్.రాము, యూఎస్ కాన్సులేట్ నుంచి అబ్దుల్ బాసిత్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఆదివాసీల అణచివేతపై రేవంత్ ట్వీట్.. రాహుల్‌గాంధీ రీ-ట్వీట్..