రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉత్తర చత్తీస్ఘడ్ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం బలహీనపడిందని.. అయినప్పటికీ దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుకు వంపు తిరుగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గురువారం కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 నుంచి 7.6 కి.మీల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. దాని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనున్నట్లు వివరించింది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా