రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఆగ్నేయ రాజస్థాన్ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు పశ్చిమ మధ్యప్రదేశ్, మధ్యమహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది.
ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో 4.5కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటలలో దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
48 గంటలలో ఇది మరింత బలపడి అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది మరింత బలపడి మొదటి 3 రోజులు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా మయన్మార్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.