నగర శివారు మున్సిపాలిటీలు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారాయి. అనుమతులు లేకుండా నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపడుతున్నారు. పంచాయతీల సమయంలో ఉన్న అనుమతులకు రెన్యువల్ చేయించుకుని అడ్డగోలుగా కట్టేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవాలనుకునే వేలాది మంది శివారు మున్సిపాలిటీలనే ఆశ్రయిస్తున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అనుమతుల్లేకుండా అపార్టుమెంట్లు, భవనాలు నిర్మించి నిర్మాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో స్టిల్ట్+2 వరకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువగా నిర్మాణాలు చేపడితే మార్టిగేజ్ చేసుకోవాలి. నిర్మాణదారులు రెండు అంతస్తులకే అనుమతులు తీసుకుని ఏడెనిమిది వరకు నిర్మిస్తున్నారు.
తూతూమంత్రంగా కూల్చివేతలు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 12 వేల అక్రమ నిర్మాణాలున్నట్లు అంచనా. ఒక్క నిజాంపేటలోనే 1001 అక్రమ కట్టడాలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ఒత్తిళ్లకు అధికారులుతలొగ్గి వాటి జోలికి వెళ్లడం లేదు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాలు వేలల్లో కొనసాగుతున్నా 40 నిర్మాణాలకు తాఖీదులు ఇచ్చి సరిపెట్టారు. బోడుప్పల్‌లో 85, పీర్జాదిగూడలో 105, శంషాబాద్‌లో 200 అక్రమ భవనాలకు నోటీసులు జారీ చేశారు.
కొరవడిన ‘ప్రణాళిక’
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకునే అధికారుల్లేరు. అందరూ డిప్యూటేషన్‌పై ఉన్నవారే.
మున్సిపాలిటీలో టీపీవో, ముగ్గురు టీపీఎస్‌లు, ముగ్గురు టీపీబీఐ, ఇద్దరు సర్వేయర్లుండాలి. అన్నిచోట్ల ఇన్‌ఛార్జిలే నెట్టుకొస్తున్నారు.
కార్పొరేషన్‌లో ఏసీపీలు ఇద్దరు, టీపీవోలు ఇద్దరు, టీపీఎస్‌లు ముగ్గురు, టీపీబీఐలు నలుగురుండాలి. బడంగ్‌పేటలో టీపీఎస్ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. జవహర్‌నగర్ టీపీవో 2 నెలలుగా రావడం లేదని సమాచారం.
అనుమతుల్లేవ్.. అంతా అడ్డదిడ్డమే
ఇది నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేటలో అక్రమ కట్టడం. గతేడాది డిసెంబరులో అనుమతుల్లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నట్లు గుర్తించి అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే అదనుగా నిర్మాణదారులు భవనానికి సంబంధించి లోపల నిర్మాణ పనులను పూర్తి చేసుకున్నారు.
కొన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
- ఆదిభట్లలో 65 అక్రమ నిర్మాణాల్లో 6 కూల్చివేసినట్లు చూపిస్తున్నా మిగిలినవి కొనసాగుతున్నాయి.
- దుండిగల్ మున్సిపాలిటీలో 70 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 33 కట్టడాలను సీజ్ చేశారు. అయినా పనులు జరుగుతున్నాయి.
- జల్‌పల్లి మున్సిపాలిటీలో 70 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. మరో 400 ఉన్నట్లు అంచనా.
- నార్సింగి మున్సిపాలిటీలో 65 అక్రమ నిర్మాణాలు గుర్తించి 56 కట్టడాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. వీటిలో 22 చోట్ల తూతూమంత్రంగా కూల్చివేతలు చేపట్టారు. తిరిగి కొనసాగుతున్నాయి.
- గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 15 నిర్మాణాలకు నోటీసులు ఇవ్వగా మూడింటిని కూల్చివేసినట్లు చూపించి మిగిలినవి వదిలేశారు.
- మేడ్చల్ మున్సిపాలిటీలో 150 అక్రమ కట్టడాలను గుర్తించగా, 15 మాత్రమే కూల్చివేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో 30 వరకు పనులు పూర్తి చేసుకున్నాయి.
- తుక్కుగూడ మున్సిపాలిటీలో 80 అక్రమ నిర్మాణాలు ఉండగా కేవలం 10 పనులనే నిలిపివేశారు.
- ఇబ్రహీంపట్నంలో 30 నిర్మాణ పనులు నిలిపివేయగా ఎనిమిది చోట్ల కూల్చివేతలు చేపట్టారు. తర్వాత వాటిని సైతం నిర్మించారు.
- తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 150 అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చి సరిపెట్టారు.
ఇదీ చదవండి: సిలిండర్ ధర పెరిగినా.. రాయితీ మాత్రం అంతే..