ICRISAT mou with panchayath raj Dept: దేశంలో వ్యవసాయ రంగం బలోపేతం, రైతుల అభివృద్ధి లక్ష్యంగా ఇక్రిశాట్, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ - ఎన్‌ఐఆర్‌డీపీఆర్ నడుం బిగించాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో ఆరు తడి పంటలు, వాతావరణ - స్మార్ట్ ఫార్మింగ్ ప్రోత్సహించేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్డీపీఆర్ కార్యాలయంలో ఇరు సంస్థల మధ్య కీలక పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్, ఎన్‌ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్రకుమార్ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఇరు సంస్థల మధ్య ఈ భాగస్వామ్యం గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, గ్రామ స్థాయిలో ఆహార భద్రతపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. రెండు సంస్థలు తమ ఉమ్మడి లక్ష్యాలు సాధించడంతో పాటు ఆసియా, ఆఫ్రికాలో 'రుర్బన్' కమ్యూనిటీలకు మంచి భవిష్యత్తును సృష్టించేందుకు ఒకరి బలాన్ని మరొకరు ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, విలువ గొలుసు అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తమ విధానాలు పంచుకోవడం, గుర్తించబడిన వ్యవసాయ, గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాల స్కేలింగ్ వంటి రంగాల్లో రెండు ప్రధాన సంస్థల మధ్య సహకారం ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
జీవనోపాధి అభివృద్ధి కోసం ఈ ఒప్పందం ప్రకారం విలువ గొలుసు అభివృద్ధి ద్వారా ఇక్రిశాట్ నిర్దేశిత పంటల కోసం 'రుర్బన్' క్లస్టర్లు అభివృద్ధి చేయడం, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్-ఎన్‌ఆర్‌ఎంతో అనుసంధానం చేసి గ్రామీణ ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి పరస్పర బలాలు పంచుకోనున్నాయి. ఈ రెండు సంస్థలు విభిన్న సహకార కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్న దృష్ట్యా... కార్యకలాపాలు భారతదేశంలో గ్రామ పంచాయతీల క్లైమేట్ ప్రూఫింగ్ ద్వారా కొత్త తరం వాటర్‌షెడ్‌ల విలువ మెరుగుపరచడం ఉద్దేశం.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం కూడా చేర్చబడింది. అంతర్జాతీయంగా అవకాశాలు, వర్షాభావ ప్రాంతాల నుంచి వ్యవసాయోత్పత్తులు ఎగుమతి చేసేందుకు వీలున్న నేపథ్యంలో రెండు సంస్థల మధ్య సహకారం చాలా ముఖ్యమని డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు.
అధిక దిగుబడినిచ్చే రకాలు, సంబంధిత విలువ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధన, అభివృద్ధిలో ఇక్రిశాట్ సాంకేతిక సామర్థ్యం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద స్వయం సహాయక బృందాల ద్వారా వ్యాపార అవకాశాలు, మార్కెటింగ్ మద్ధతు సృష్టించడంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్ బలంగా పని చేస్తుందని ఆయన తెలిపారు. సుస్థిర, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా భారత్‌సహా ఆఫ్రికా కోసం రెండు సంస్థలు కలిసి పనిచేయాలని డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: