Hyderabad Woman Dies In Chardham Yatra: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళుతుంటారు. అక్కడికి వెళ్లిన భక్తులు.. ఆ వాతావరణ పరిస్థితులతో ప్రతిరోజు యుద్ధమే చేయాల్సి వస్తోంది. అక్కడి వాతావరణం ఏ సమయానికి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళపై బండ రాయి పడడంతో.. అక్కడికక్కడే పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.సరోజ (46), వెంకట్ రామన్ భార్యాభర్తలు.. వీరు హైదరాబాద్‌లోని కొత్తపేటలో అల్కాపురి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ సభ్యులతో చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. శుక్రవారం యధావిథిగా యమునోత్రి ధామ్‌లో దర్శనాలు అన్నీ చేసుకొని.. ఖరాడి పట్టణంలోని ఒక హోటల్‌లో బస చేశారు.
ప్రాణం తీసిన బండరాయి: ఆ మరుసటి రోజు ఉదయం గంగోత్రి ధామ్‌కు బయలు దేరిన ఆమె.. కొండపై ఉన్న వాహనం దగ్గరకు వెళ్లింది. హఠాత్తుగా కొండపై నుంచి బండ రాయి జారి ఆమె మీద పడింది. ఆమె తలకు బలమైన గాయం అయింది. అక్కడే ఉన్న స్థానికులు ఏం జరిగిందో చూసే లోపే ఈ ఘటన జరిగిపోయింది. అక్కడ అంతా కాసేపు గందగోళం నెలకొంది. స్థానికుల సహాయంతో తనను కుటుంబ సభ్యులు దగ్గరలోని బార్కోట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మహిళ మృతి చెందింది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీని తర్వాత ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి.. పోస్టుమార్టం నిమిత్తం నౌగావ్‌కు పంపించారు. ఆ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
చార్‌ధామ్ యాత్ర.. జాగ్రత్తలు: ఉత్తరాఖండ్ ప్రతి ఏడాది వేసవి కాలాల్లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇప్పటి వరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. లక్ష మందికి పైగా భక్తులు చార్‌ధామ్ యాత్రకు చేరుకున్నారు. దీంతో ఈ యాత్రలో ఇప్పటికి 9 మంది భక్తులు మరణించారు. చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు చలి, వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాలు వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంది.
ఇవీ చదవండి: