Heavy Rains In Hyderabad : గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపించాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్‌తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి.. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట కాలనీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరుతో పాటు పాములు రావడంతో.. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమై వాటిని బంధించి తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో వరద బీభత్సం సృష్టించింది . గాజుల రామారంలోని.. వొక్షిత్ ఎంక్లేవ్, ఆదర్శ నగర్, ఇంకా పలు కాలనీలు మళ్లీ నీట మునిగాయి. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్ కేసర్, పోచారం, మేడిపల్లిలలో వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో.. వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
Rainfall In Hyderabad : దుండిగల్, బాచుపల్లి నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. తాండూర్, పరిగి నియోజకవర్గాల్లోని చెరువులు, ప్రాజెక్టులు నిండిపోయాయి. నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా లోపలికి వర్షపు నీరు రావడంతో.. భక్తులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల నుంచి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ.. కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు.
చినుకు చినుకుగా మొదలైన ఆపై కుంభవృష్టి : కొద్దిపాటి జల్లులతో మొదలైన వర్షం కుంభవృష్టిగా మారడంతో.. అంబేడ్కర్ నగర్‌లో వర్షపు నీరు.. ఏరులై పారడంతో బస్తీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ రైల్ నిలయానికి ఎత్తైన ప్రాంతం నుంచి వరద రావడంతో.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి రెండు అంతస్తుల్లోకి నీళ్లు చేరి ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచాయని బాధితులు వాపోయారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు భారీ స్థాయిలో వరద నీరు పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 2000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో.. 4గేట్లు ఎత్తి మూసినదిలోకి 2750 క్యూసెక్కుల నీటిని వదిలేశారు.
Rains In Hyderabad : నిన్న ఉదయం వరద తగ్గు ముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న స్థానికులకు.. మరోసారి సాయంత్రం కురిసిన వర్షానికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో వరద నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం మోస్తారు వర్షం ప్రారంభం అవ్వడంతో.. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ప్రతి సంవత్సరం ఇలాగే వరద ప్రభావం కొనసాగుతుందని.. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి వరద సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.
ఇవీ చదవండి :