విద్య వ్యవస్థ మార్పుకు, ఉద్యోగ కల్పన, అధ్యాపకుల హక్కుల సాధన కోసం పోరాడుతానని స్వతంత్ర అభ్యర్థి, సాంకేతిక కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. విద్యార్థులు నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగాలు రాక ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునేవారు లేరని విమర్శించారు. నిజాం కాలేజిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నిజాం కాలేజిలో అధ్యాపకులను, ఉద్యోగాలను కలిసి క్రమ సంఖ్య-19కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 19 నెలల నుంచి యూనివర్సిటీలకు వీసీలను నియమించక పోవడంపై ప్రస్తుత ఎమ్మెల్సీలు ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలోనే ఓటర్లు గుర్తుకొస్తారని ఆరోపించారు.
ఏడాది నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ.. దాదాపు 48 మంది అధ్యాపకులు చనిపోయినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయినా వారిని ఆదుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితిలో.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రైవేట్ అధ్యాపకులకు, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం