Man stucked between stones in Hyderabad : సరదా పడి ఓ యువకుడు పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు. దాదాపు 3 గంటల పాటు అందులో ఇరుక్కుపోగా పోలీసులు శ్రమించి బయటకు తీశారు. దాదాపు 3 గంటల పాటు నరకయాతన అనుభవించిన యువకుడు పోలీసుల సాయంతో ఎట్టకేలకు బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన రాజు(26) బతుకు దెరువుకోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడ్డాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న కానిస్టేబుళ్లు రాంబాబు, బాషా, రాజు.. అక్కడికి చేరుకొని అతడి భూజానికి తాళ్లు కట్టి అతికష్టం మీద బయటకు లాగారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలారు. రాజును కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్‌కుమార్ అభినందించారు.
ఇవీ చదవండి: