Anti Drug Committees in Telangana colleges: మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చర్యలు చేపడుతునే ఉన్నారు. అయినప్పటికీ కొందరు యువత, విద్యార్థులు వీటికి అలవాటి పడి వారి జీవితాలు చీకటిమయం చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిపై మార్పు తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. మత్తు పదార్థాల బారిన పడితే వాటి వల్ల కలిగే దుష్పలితాలపై అవగాన కల్పించాలని హైదరాబాద్ నగర పోలీసు విభాగం నిర్ణయించింది.
వివిధ కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఇందుకోసం మాదకద్రవ్య నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిరోధక కమిటీల్లో విద్యార్థులు, అధ్యాపకులు.. ప్రాథమికంగా కనీసం అయిదుగురు సభ్యులుగా బాధ్యతలు నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. పోలీసులు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంటీ డ్రగ్ కమిటీలు.. డిజిటల్ ఫ్లాట్‌ఫాం, సెమినార్లు, సదస్సులు వంటివి నిర్వహిస్తూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి.. విద్యాసంస్థల యాజమాన్యాలు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారని అరికట్టడానికి పోలీసులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: భాగ్యనగర వాసులకు శుభవార్త.. ఇక రిజిస్ట్రేషన్ సమస్యకు చెక్!
స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'