numaish in hyderabad 2022 : కొత్త ఏడాదిలో హైదరాబాద్ నగరవాసులను అలరించేందుకు 81వ నుమాయిష్ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే వస్త్ర, వస్తు ప్రదర్శన కోసం జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల అనుమతులు తీసుకున్నామని సొసైటీ తెలిపింది.
పక్కాగా కొవిడ్ నిబంధనలు
హైకోర్టు మార్గదర్శనాలు అమలు చేస్తూ.. కొవిడ్ నేపథ్యంలో స్టాళ్ల సంఖ్యను సైతం 1600 కు కుదించారు. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల నడుమ.. మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేసి నుమాయిష్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభా శంకర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మకశ్మీర్, పశ్చిమ బంగ తదితర రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి.
అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు
నాంపల్లి వస్తు ప్రదర్శనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మధ్య మండల ఇంఛార్జి డీసీపీ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులతో సమావేశమై... పలు సూచనలు చేశారు. స్టాళ్ల వద్ద తీసుకున్న చర్యలను తనఖీ చేశారు. ఫైర్, ఎలక్ట్రికల్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల అనుమతులు వచ్చాయని..అన్నింటిని సీపీకి సమర్పించామన్నారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
హై సెక్యురిటీ
ప్రైవేటు సెక్యురిటీతో పాటు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి స్టాల్లో 8 కేజీల ఫైర్ రెడ్యుసింగ్ సిలిండర్ అందుబాటులో ఉంటుందన్నారు. మైదానంలో వంట చేసేందుకు అనుమతి లేదన్న ఆయన... నుమాయిష్‌కు వచ్చే ప్రజల కోసం గేట్ల వద్ద సైన్ బోర్డులు పెట్టనున్నట్లు వెల్లడించారు. మరో వారంలో ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న ఆయన... మెట్రో, ఆర్టీసీ ఎక్కువ సర్వీసులు అందించాలని కోరినట్లు తెలిపారు. కరోనా టెస్టింగ్, టీకా స్టాల్ డెస్కులు అందుబాటులో ఉంటాయన్నారు.
గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం..
Numaish from January 1 : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్)ను గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 20ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో ఆరెకరాల స్థలంలోనే 1500 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన స్థలాన్ని సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. నో మాస్క్.. నో ఎంట్రీ పద్ధతిని అమలు చేస్తామన్నారు. ఎగ్జిబిషన్‌లో రౌండ్ ది క్లాక్ ఫ్రీ వ్యాక్సినేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు