GHMC Negligence : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నిర్లక్ష్యం వల్ల లక్షలమంది వాహనదారులు ఈ వర్షాకాలంలో కూడా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. నగరంలో భారీ వర్షాలతో చెరువుల్లా మారే నీటి నిల్వ ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన బల్దియా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. వాహనాలు కదలకుండా నిల్చిపోయే 50 నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి అక్కడ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరినా బల్దియా స్పందించలేదు. కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే పనులు మొదలుపెట్టి వదిలేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడితే నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిల్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
Flood Issues in Hyderabad : రాజధాని రోడ్లపై ప్రతి రోజూ 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఏదైనా ప్రధాన రహదారిపై చిన్న ప్రమాదం జరిగినా.. చిన్నపాటి వర్షం పడినా గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడం పరిపాటి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రాఫిక్ పోలీసులు రహదారులపై వరద నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించారు. చెరువుల్లా మారే 50 నీటి నిల్వ కేంద్రాల జాబితాను ట్రాఫిక్ పోలీసులు బల్దియా అధికారులకు అందజేశారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయం చేస్తే ఇందులో చాలా చోట్ల నీరు నిల్వ లేకుండా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Monsoon in Hyderabad : సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా వరద నీటి నాలాలను నిర్మించి ప్రధాన నాలాలకు అనుసంధానం చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బల్దియా అధికారులు ఏడాదిగా మూడు చోట్ల పనులను ప్రారంభించారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింది భాగంలో రెండు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. మరో నెల రోజులకు గానీ పూర్తయ్యేలా లేదు.
పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర కూడా పనులు ప్రారంభించినా ఇప్పటకీ పూర్తికాలేదు. బేగంపేట రసూల్‌పుర దగ్గర ఇటీవలే మొదలుపెట్టగా.. పూర్తయ్యేందుకు మరో నెలన్నర పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరో రెండు చోట్ల తాత్కాలికంగా పనులు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాలను అధికారులు విస్మరించారు. ప్రధాన రోడ్డుపై పడ్డ వర్షం నీరు నాలాలోకి పోవడానికి జాలీలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఫలితంగా రోడ్డు మీదకు చేరిన వర్షం నీరు నాలాల్లోకి పోయే అవకాశం కన్పించడం లేదు.
నగరంలో..