పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఒడిశా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా రాగల రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ వానలు
ఆంధ్రప్రదేశ్లోనూ అల్పపీడనం ఏర్పడనుందని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం వెంబడి.. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దు హెచ్చరించింది.
అన్నదాతకు ఊరట
రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో తడిసి ముద్దైన నేలలు ఆ తర్వాత బీడులుగా మారాయి. విత్తనాలు వేసే సమయంలో దంచికొట్టిన వానలు... పత్తాలేకుండా పోయాయి. చినుకు జాడ కోసం అన్నదాత ఎంతో ఎదురుచూశారు. కాగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తడారిపోయిన పంటపొలాలకు ఈ వానలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదీ చదవండి: SRISAIALM RESERVOIR: శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది... కిన్నెరసానికి పెరిగింది!