KTR Release Hyderabad City Biodiversity Index: హైదరాబాద్ నగర జీవవైవిద్య సూచీ విడుదలైంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నివేదిక విడుదల చేశారు. జీవవైవిధ్యంలో పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిన మహానగరం.. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల సంరక్షణ వంటి కార్యక్రమాలతో జీవవైవిధ్యానికి బాసటగా నిలించింది.
తాజా పరిస్థితులకు అనుగుణంగా జీవవైవిధ్యాన్ని దేశంలో రెండోసారి మదింపు చేసిన ఏకైక నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిన నేపథ్యంలో జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను తిరిగి రెండోసారి రూపొందించిన తాజా నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది.
నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధి కోసం ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. నగర జీవవైవిధ్య సూచీ వల్ల ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రయత్నాలు విస్తృతంగా సాగుతున్నారు. ఈ రంగంలో స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు వంటి మెత్తం 23 రకాల అంశాలను కొలమానంగా తీసుకొని ఈ సూచీ రూపొందింది.
బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధి: మొత్తం 23 అంశాలకుగానూ అత్యధికంగా 92 మార్కులు కేటాయించడం జరుగుతుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 92 మార్కులకుగానూ 57 మార్కులు సాధించింది. అయితే 2012లో నగరంలో అప్పుడు జరిపిన బయోడైవర్సిటీ ఇండెక్స్ అధ్యయనంలో కేవలం 36 మార్కులు మాత్రమే లభించాయి. గత 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో జీవవైవిధ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధిని సాధించింది.
జీవించు-జీవించనివ్వు: నగరం కోసం ప్రత్యేకంగా జీవవైవిధ్య సూచీ నివేదిక తయారు చేసిన అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఒక నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా మారే పరిణామ క్రమంలో జీవవైవిధ్యం అత్యంత కీలకమైన అంశమని అన్నారు. జీవించు-జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
సరస్సుల నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో దాదాపు 2000 హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350 పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్ల గుట్టలు, కేబీఆర్, హరణి వనస్థలి రెండు జాతీయ పార్కులు నగరంలో జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో తేలింది. దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన ప్రాంగణాలు జీవవైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయని తేలింది.
ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో 1305 వృక్షజాతులు ఉండగా.. 577 ప్రాంతీయ వృక్షజాతులు, 728 ఇతర ప్రాంత వృక్షజాతులు నగరంలో ఉన్నాయని తేలింది. 30 రకాల తూనీగ జాతులు, 141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.
భవిష్యత్తులో జీవవైవిధ్యం పెరుగుతుంది: ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, చెరువుల సంరక్షణ-బలోపేతం, అడవుల పెంపకం, అర్బన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ది కార్యక్రమాలు నగర జీవవైవిధ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా నిలిచాయని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులోనూ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జీవవైవిధ్యం మరింత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పురపాలికల్లో జీవవైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతోందని తెలిపారు.
ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి: దీంతోపాటు పట్టణ ప్రకృతివనాలు, నర్సరీల ఏర్పాటు వంటి అనేక ఇతర హరిత కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి అటు పట్టణాలు, ఇటు పల్లెల్లో తెలంగాణ వ్యాప్తంగా హరిత కవర్ పెరిగిందన్నారు. ఇప్పటికే నగరంతో పాటు అనేక పట్టణాలకు ఈ కేటగిరీలో అవార్డులు సైతం లభించాయి. ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ జీవవైవిధ్యం పెంపునకు ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఇవీ చదవండి: