రాష్ట్రంలో కోటిన్నర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎన్పిడిసిఎల్ సంస్థ 2018 సెప్టెంబర్ నుంచే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలంటే రూ.1150కోట్లు ఖర్చవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర రూ.10 వేల వరకు ఉంటుంది. కొనుగోలులో రాయితీ కోసం విద్యుత్ శాఖ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. స్మార్ట్ మీటర్లను మూడు దశల్లో అమలు చేయాలని విద్యుత్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఇంకా రెండు మూడేళ్లలో ఈ మీటర్లను అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో 10,500ల ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. మరో 2వేల వరకు ఈ మార్చి వరకు బిగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ మీటర్లతో విద్యుత్‌ను ఎంత రీచార్జ్ చేసుకున్నాం..? ఎన్ని రోజులు వాడుకునే అవకాశం ఉంటుంది..? సరఫరా ఎన్నిరోజులు ఉంటుంది..? ఈ వివరాలన్నీ.. ఫోన్‌కు సందేశం వస్తోంది. సమయానికి రీఛార్జ్ చేసుకోకుంటే ఆన్లైన్లో కనెక్షన్ నిలిపివేసే వెసులుబాటు ఉంటుంది.
స్మార్ట్ మీటర్ వల్ల వాటర్ పంపు, ప్రిజ్ , కూలర్, ఏసీ, టీవీ వంటి వాటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఆదివారాలు, పండగరోజుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పూర్తయిపోతే.. ఆ రోజుల్లో స్మార్ట్ మీటర్ పనిచేసి.. మరుసటిరోజు ఆగిపోయేలా సెట్ చేశామంటున్నారు అధికారులు. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే.. అటు వినియోగదారులకు, ఇటు అధికారులకు మేలు జరుగుతుందని విద్యుత్ శాఖ చెబుతోంది.