Husband Donates Liver to Wife : వారం రోజులకంటే ఎక్కువ బతకదన్న ఓ మహిళకు.. కట్టుకున్న భర్తే కాలేయం దానం చేసి కాపాడుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్న 39 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆ మహిళ భర్త అండతో ప్రాణం పోసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపులో నొప్పితో పాటు.. కామెర్లు సోకి నెల కిందట ఫిట్స్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమైంది.
Husband Donates Liver to Wife Hyderabad : శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆఫ్రీన్ కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను హైదరాబాద్ నగరానికి సమీపాన ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... వారానికి మించి బతకదని డాక్టర్లు తేల్చి చెప్పారు. తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని తపించిన ఆ భర్త హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అక్కడ హెపటాలజిస్ట్ డా.చందన్‌కుమార్, డా.అమర్నాథ్ తదితర వైద్య బృందం నేతృత్వంలో ఆమెను పరిశీలించి.. క్రానిక్ లివర్ ఫెయిల్యూర్‌గా గుర్తించారు. వైద్యులు విషయాన్ని భర్త మహమ్మద్ లియాఖత్‌కు తెలిపారు.
దానికి అతడు తన కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో.. జూన్ 3న లివర్ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందని వైద్యులు వెల్లడించారు. పడకకు పరిమితం అయిన ఆమె పది రోజుల్లో కోలుకుని నడవడం ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో పాటు తన పనులు తాను చేసుకునే స్థితికి చేరిందని తెలిపారు.
Husband Built Temple For Wife : భార్య కోసం గుడి నిర్మించిన భర్త.. అక్కడే ఉంటూ రోజూ పూజలు..
ప్రపంచంలోనే కాలేయం మార్పిడికి (Liver Transformation Surgery) మించిన ప్రధాన ఆపరేషన్ మరొకటి లేదని డాక్టర్లు చెప్పారు. లివర్ దాతలకు ఆరు వారాల్లో రికవరీ అవుతుందని తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా లివర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావాలని వైద్యులు కోరారు. రక్త గ్రూప్ కలిస్తేనే దానం చేయడానికి వీలవుతుందని వివరించారు. తన భార్యను కాపాడినందుకు వైద్యులకు కన్నీటితో భర్త మహమ్మద్ లియాఖాత్ కృతజ్ఞతలు తెలిపారు.
నేను బతుకుతానని అసలు అనుకోలేదు. నా భర్త ధైర్యంగా ముందుకు వచ్చి కాలేయం ఇవ్వడంతో మరోవైపు.. వైద్యుల కృషి వల్ల నేను ప్రాణాలతో బతికి బయటబడ్డాను. వీరందరి సమస్ఠి కృషి నన్ను మునుపటిలా మార్చింది. నేను వారమే బతుకుతానన్న వార్త విన్నప్పటి నుంచి నా ఆలోచనలన్నీ నా ఇద్దరు పిల్లలు పైనే ఉన్నాయి. వాళ్లెక్కడ తల్లిలేని పిల్లలు అవుతారని భయపడ్డాను. -ఆఫ్రీన్ సుల్తానా, లివర్ మార్పిడి చేసుకున్న మహిళ
2013లో తప్పిపోయిన మహిళ.. ఇన్నేళ్లకు భర్త చెంతకు.. ఎలా దొరికిందంటే?
'భర్త నల్లగా ఉన్నాడని అనడం క్రూరత్వమే'... విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు వ్యాఖ్య