రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 2019లో సాధారణ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికైన వారిలో కొందరు రాజీనామా చేయగా... మరికొందరు మరణించారు. కొన్ని చోట్ల రిజర్వేషన్‌కు తగినట్లు ఓటర్లు లేకపోవడం వల్ల నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. అప్పటి నుంచి ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆయా గ్రామాలు, వార్డులకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు లేకుండా పోయారు. కొన్ని చోట్ల గత రెండేళ్లుగా ఆయా స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
గ్రామ ప్రథమ పౌరులు లేకుండానే..
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 75 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఏడు గ్రామాల్లో సర్పంచ్‌లు లేరు. నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఐదు చొప్పున... ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నాలుగు చొప్పున ఖాళీలున్నాయి. వరంగల్ రూరల్, కరీంనగర్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మూడేసి... ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మెదక్, జనగాం, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో సర్పంచ్‌లు లేరు. రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ - మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాల్ల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.
అక్కడా ఎవరూ లేరు...
ఆదిలాబాద్ రూరల్ జడ్పీటీసీ స్థానం కూడా ఖాళీగా ఉంది. ఆ స్థానం ఖాళీ కావడంతో ఆదిలాబాద్ జడ్పీ ఉపాధ్యక్ష పదవి కూడా ఖాళీగానే ఉంది. వివిధ గ్రామాల్లో ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు కూడా ఖాళీగానే ఉన్నాయి. రెండు చోట్ల ఎంపీపీ పదవులు, ఒక ఎంపీపీ ఉపాధ్యక్ష పదవితో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు కూడా ప్రతినిధులు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ఉపసర్పంచ్ పదవులతో పాటు 880 వార్డుసభ్యుల పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఆయా స్థానాలకు ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు.
ఒక్క ఎల్లంపల్లిలోనే...
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఎన్నిక కోసం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. ఎల్లంపల్లి సర్పంచ్ ఎన్నిక విషయంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్కడ ఓటర్ల జాబితా పక్రియను పూర్తి చేశారు. ఎన్నిక కోసం కూడా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగతా అన్ని ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అక్కడ నుంచి సమ్మతి వస్తే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయి.
ఇదీ చూడండి: జంబో సైజులో పట్టభద్రుల బ్యాలెట్ పత్రం!