- షాపింగ్ నుంచే..
చాలామంది షాపింగ్‌కి వెళ్లేటప్పుడు ఇంట్లో ఏయే పదార్థాలున్నాయి.. ఏం లేవు.. అన్నవి చూసుకోకుండానే బయల్దేరుతుంటారు. దాంతో బజారుకు వెళ్లిన తర్వాత అన్నీ అవసరమే అనిపిస్తుంది. ఫలితంగా అవసరం లేని వస్తువులు సైతం కొంటుంటారు. దీనివల్ల పాతవి, కొత్తవి.. వస్తువులన్నీ కలిపి ఉపయోగించాల్సి రావడంతో కొన్ని పదార్థాలు పాడైపోయే అవకాశం లేకపోలేదు. అందుకే షాపింగ్‌కి వెళ్లేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీనికోసం ముందుగానే వచ్చేవారంలో ఏమేం వంటకాలు వండాలో నిర్ణయించుకోవాలి. దీంతో ఏమేం సరుకులు అవసరం అవుతాయో ఓ నిర్ణయానికి వచ్చే వీలుంటుంది. దీన్ని బట్టి ఇంట్లో ఉన్న సరుకుల ఆధారంగా ఏయే పదార్థాలు కొనాలో నిర్ణయించుకోవాలి. వాటిని రాసుకోవడం వల్ల అవసరం లేని వస్తువులను కొనే అవకాశం ఉండదు.
- ఎక్కువ వద్దు..
మీరు వస్తువులను కొనాలనుకున్నప్పుడు ఎంత మొత్తంలో కావాలనుకుంటే అంతే మొత్తంలో కొనేలా చూసుకోండి. ఉదాహరణకు మీకు వారానికి కేవలం పావు కేజీ పచ్చిమిర్చి మాత్రమే అవసరం అనుకోండి. సూపర్‌మార్కెట్లో ప్యాకెట్ ఉంది కదా అని కేజీ కొనేయడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లూజ్‌గా కొనడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కా కేవలం కూరగాయల విషయంలోనే కాదు.. వస్తువులు, ధాన్యాలు, పిండి.. వంటి నిత్యావసర వస్తువుల విషయంలోనూ ఉపయోపడుతుంది. అలాగే మీరు ఒక్కరే ఉంటున్నట్లయితే మీరు ఉపయోగించే సరుకులు కుటుంబంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి అంచనా వేసి కొనుక్కోవడం మంచిది. మీరు రోజూ వంట చేసుకుంటే సరి, లేదంటే వంటకు ఉపయోగించే వస్తువులన్నీ కొని, వాటిని వృథా చేయకపోవడం మంచిది. దీని బదులుగా వంట చేయనవసరం లేకుండానే తినగలిగే వస్తువులను కొనుక్కోవచ్చు.
- ‘ఎఫ్ఐఎఫ్ఓ’ పద్ధతి పాటించండి..
నిత్యావసరాలు లేదా కూరగాయలు కొన్న తర్వాత కూడా అందులో ముందుగా పాడైపోయే వస్తువులేంటో గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా ఉపయోగించడం వల్ల వృథాను అరికట్టే వీలు కలుగుతుంది. వృథాను అరికట్టడానికి 'ఎఫ్ఐఎఫ్ఓ' అనే పద్ధతిని పాటించమని చెబుతారు నిపుణులు. ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్.. అంటే.. మొదట లోపలికి పెట్టిన దాన్ని మొదట బయటకు తీసి, ఉపయోగించడం అన్నమాట. దీనికోసం కొత్తగా తీసుకొచ్చిన వస్తువులను వెనుకగా, అంతకంటే ముందు తీసుకొచ్చిన వస్తువులను ముందుగా ఉంచడం వల్ల ముందు వీటినే ఉపయోగించే వీలుంటుంది.
- వృథాను రాసేయండి..
వండిన పదార్థాలను తినగా మిగిలినవి పడేయడం చాలామందికి అలవాటే. కానీ వాటిని వృథా చేయకుండా వీలైనంతగా తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఒకసారి వండిన పదార్థాలను మళ్లీ మరోరకంగా ఉపయోగించే వీలుందేమో ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో 'క్విక్ ఈట్‌మీ బాక్స్' బాక్సును ఉంచడం వల్ల అందులో ఉంచిన పదార్థాలు త్వరగా తినే అవకాశం ఉంటుంది. తద్వారా వృథాకు చెక్ పెట్టవచ్చు. పాడయ్యే వస్తువులను, పడేసే వస్తువులను లిస్టు రాసుకోవడం వల్ల ఆ తర్వాత అలాంటివాటిని తక్కువగా కొనే వీలుంటుంది. అంతేకాదు.. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను 1 నుంచి 5 డిగ్రీల మధ్య ఉంచుకోవడం వల్ల ఆహారపదార్థాలు తొందరగా పాడుకాకుండా జాగ్రత్తపడచ్చు.
చూశారుగా.. ఆహారపదార్థాల వృథాను ఎలా అరికట్టవచ్చో.. మరి, మీరూ వీటిని ప్రయత్నించి, వృథాకు కళ్లెం వేయండి.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!