Mahashivratri Festival: మహాశివరాత్రి వచ్చేస్తోంది. చాలా మంది ఈ పర్వదినాన ఉపవాసం ఉంటారు. అయితే కొందరు పరమేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష పూనుకుంటే.. మరికొందరు బరువు తగ్గాలని ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసం ఉండాలనుకునే వారు తిండి మానేసి పస్తులు ఉండకూడదట. ఇలా చేయడం వల్ల ఉపయోగాలు కన్నా ఆరోగ్యానికి నష్టమే ఎక్కువగా జరుగుతుందని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉపవాసాలు చేసే విధానాల గురించి తెలుసుకుని వారు చెప్పిన నియమాలు పాటిస్తే.. మంచి ఫలితాలను వస్తాయి. మరి అనేంటో ఓసారి చూద్దామా..?
నిర్జలోపవాసం: కనీసం నీరు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని నిర్జలోపవాసంగా పిలుస్తారు. రోజంతా నీళ్లు తాగకుండా ఉండడం వల్ల శరీరం తన స్థితిని కోల్పోతుంది. ఆహారం తినకుండా అయినా కొన్ని రోజులు ఉండవచ్చు కానీ.. నీళ్లు తాగకుండా ఉండకూడని వైద్య నిపుణులు చెబుతారు. శరీర ఉష్ణోగ్రతలను నీరు అదుపు చేస్తుంది. అందువల్ల నీళ్లు తాగడం మానకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ నిర్జలోపవాసాన్ని పాటించకపోవడమే మంచిదని నిపుణులు భావిస్తారు.
జలోపవాసం: అన్నం, పండ్లు వంటివి తీసుకోకుండా కేవలం నీెెెెెెళ్లు మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని జలోపవాసం అంటారు. అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారు తరుచూ ఈ ఉపవాసం చేయడం వల్ల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తుంటారు. నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం. ఆ నీటిలో కాస్త నిమ్మ రసం, తేనె కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మరసంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది కరుగుతుంది. శరీరం నీరసించకుండా చేస్తుంది. ఇలా ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో 8 నుంచి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మరే ఇతర ఆహారం తీసుకోకపోయినా ఫర్వాలేదు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి దరికి చేరవు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపవేయబడతాయి.
కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ: ఆహారం ఏమీ తినకుండా.. కేవలం పండ్ల రసాలను మాత్రమే తాగుతూ ఉపవాసాన్ని చేయవచ్చు. ప్రధానంగా యాపిల్, కర్జూజా, నారింజ, పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల రసాలను సేవించాలి. దీనివల్ల శరీరానికి తక్షణ శక్తి అనేది వస్తుంది. ఈ పండ్ల రసాలు శరీరంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఘనాహారంతో ఉపవాసం: నీరు లేదా పండ్లను తీసుకుంటూనే ఉపవాసం చేయాలని నియమం అనేది ఏమీ లేదు. మహాశివరాత్రికి లోకనాయకుడికి ప్రీతిపాత్రమైన నైవేధ్యాలతో సేవిస్తాము. ఈ క్రమంలో సగ్గుబియ్యం, చిలగడదుంప, మొక్కజొన్న వంటి పదార్థాలతో రకరకాల వంటకాలు చేస్తాము. వీటినే ప్రసాదంగా స్వీకరించి దీక్షను సాగించవచ్చు. దీనినే ఘనాహార ఉపవాస దీక్ష అంటారు. ఇలా చేయడం వల్ల అలసట అనేది దరిచేరదు.
ప్రధానంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
- ముందు రోజు ఉపవాసం చేస్తున్నాము కదా అనీ ఆ రోజు ఎక్కువగా ఆహారం తినడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుంది.
- ఉపవాసం చేస్తున్నప్పుడు బలమైన ఆహారాన్ని మధ్య మధ్యలో తీసుకోకూడదు. దీనివల్ల అజీర్తి, బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
- ఉపవాసం చేసే ముందు రోజు కారంతో చేసిన ఆహార పదార్థాలను ముట్టకపోవడమే మంచిది. ఎందుకంటే వీటివల్ల కడుపులో ఎసిడిటీ స్థాయి పెరిగి.. కడుపులో పుళ్లు పుట్టడం, మంట, అజీర్తి, విరేచనాలు వంటి అనేక ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయి. దీనివల్ల ఉపవాసం చేయడానికి శరీరం సహకరించదు.
- మధుమేహం, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.. గర్భిణీలు ఈ ఉపవాస దీక్షలు చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: