Finalized Selection In State Police Recruitment: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో తుది అంకం మాత్రమే మిగిలి ఉండటంతో కొలువులు సాధించేందుకు అభ్యర్థులు కసరత్తు ముమ్మరం చేశారు. తాజా నోటిఫికేషన్లలో కీలకమైన సివిల్ కానిస్టేబుల్ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశముండటం విశేషం. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలుండటం.. ఇందులో పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ఏ విభాగాలకు ఎంత మంది పోటీ: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. ఈక్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. అయితే కీలకమైన సివిల్ విభాగంలోనే 15,644 పోస్టులున్నాయి. ఈనేపథ్యంలో వీటికోసం 90,488 మంది పోటీలో ఉన్నారు. ఈలెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశముండటంతో అభ్యర్థుల్ని ప్రభుత్వోద్యోగం కల ఊరించే అంశంగా మారింది. వాస్తవానికి 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తొలుత 9,54,064 దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రాథమిక రాతపరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల వడబోత అనంతరం 1,75,657 మంది మాత్రమే మిగిలారు. ఇంకా ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది.. మెకానిక్ విభాగంలో 56 మంది.. డ్రైవర్ విభాగంలో 65 మంది.. రవాణా విభాగంలో 143 మంది.., ఎక్సైజ్‌శాఖలో 97 మంది.., అగ్నిమాపకశాఖ ఆపరేటర్ విభాగంలో 12 మంది పోటీలో ఉన్నారు.
ఎస్సై పోస్టులకు మాత్రం పోటాపోటీ: కానిస్టేబుళ్ల కొలువుల కోసం పోటీ తక్కువగా ఉండగా.. ఎస్సై కొలువుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అన్ని విభాగాల్లో కలిపి 587 పోస్టుల కోసం తొలుత 2,47,630 దరఖాస్తులు నమోదయ్యాయి. తాజాగా శారీరక సామర్థ్య పరీక్షల ఫలితాల అనంతరం వీరిలో 59,574 మంది మాత్రమే మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. మొత్తం పోస్టుల్లో సివిల్ విభాగంలోనే ఏకంగా 554 పోస్టులున్నాయి. వీటికోసం 52,786 మంది ప్రస్తుతం పోటీలో ఉండటంతో ఈ విభాగంలో ఒక్కో పోస్టుకు 95 మంది పోటీపడుతున్నారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 179 మంది చొప్పున.. పోలీస్ రవాణా విభాగంలో 311 మంది చొప్పున.. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 240 మంది చొప్పున పోటీలో ఉండటం గమనార్హం. తుది రాతపరీక్ష అనంతరం సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా విజేతల ఎంపిక జరగనుంది.
ఇవీ చదవండి: