హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రేపట్నుంచి సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నోటీసు జారీ చేసింది. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల సోమవారం 44 మంది కమిషన్ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కోహెడ మార్కెట్.. సుడిగాలి దుమారానికి కుప్పకూలిపోవడం వల్ల గడ్డి అన్నారం మార్కెట్‌కు రద్దీ పెరిగింది.
తమకేవీ పట్టవు..!
మార్కెటింగ్ శాఖ, పోలీసులు మైకుల్లో ప్రకటనలు చేసినప్పటికీ... భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి అంశాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనం రద్దీ కట్టడి లక్ష్యంగా మార్కెట్‌కు తాత్కాలిక సెలవు ప్రకటించారు. ఇందువల్ల రేపట్నుంచి మామిడికాయల క్రయ, విక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిచిపోనున్నాయి.
ఉన్నతాధికారులదే తుదినిర్ణయం..
మార్కెట్ పునఃప్రారంభం ఎప్పుడనేది మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులే నిర్ణయిస్తారని కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి యండ్రపల్లి వెంకటేశం తెలిపారు. భవిష్యత్తులో మార్కెట్ తెరిచినా.. రోజూ కొద్ది మందికి మాత్రమే క్రయవిక్రయాలు జరిపే అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..