Holi Celebrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. గురువారం రాత్రి నుంచే చిన్నాపెద్దా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కామ దహనం చేసిన అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
హైదరాబాద్‌లో కామదహనం
హోలీని పురస్కరించుకుని హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్ సముదాయంలో కామదహనం నిర్వహించారు. గృహ సముదాయవాసులు రంగులు పూసుకొంటూ సందడి చేశారు. హనుమకొండ జిల్లాలో పలు చోట్ల కాముడి దహనం నిర్వహించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
గాలి కాలుష్యం కాకుండా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో కామదహనం నిర్వహించారు. గాంధీ చౌక్‌లో ఆర్యసమాజ్, నగర ప్రజలు పాల్గొని కాముడ్ని దహనం చేశారు. ప్రతి ఏటా కాముడ్ని కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. నగరంలో మొట్టమొదటగా ఇక్కడే కామ దహనం చేస్తారు. యజ్ఞంతోనే గాలి కాలుష్యం జరగకుండా ఉంటుందని.. పనికి రాని వస్తువులతో కామ దహనం చెయ్యడం జరుగుతోందని ఆర్య సమాజ్ జిల్లా అధ్యక్షుడు రామలింగం పేర్కొన్నారు.
ఆటపాటలతో
నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి, మోపాల్, గణపూర్, నడిపల్లి, ధర్మారం గ్రామాల్లో ఘనంగా కామ దహనం నిర్వహించారు.. సాంప్రదాయ జానపద పాటలు పాడుతూ కామదహనం చుట్టూ తిరుగుతూ మహిళలు వేడుక నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పొందాలని కోరుతూ వేడుక చేసుకున్నారు.
చిన్నారుల సందడి
ఖమ్మంలో చిన్నారులు ఒక రోజు ముందుగానే హోలీ వేడుకలు నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగితేలారు.
ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ముందస్తుగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మార్వాడీలు కామ దహన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానిక మార్వాడీ ధర్మశాలలో కామ దహనం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఇదీ చదవండి: Errabelli holi Dance: మంత్రి హోలీ స్టెప్పులు.. మహిళలతో ఉత్సాహంగా కోలాటం