రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో లేఅవుట్ క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) కోసం వసూలైన నిధుల వినియోగానికి సంబంధించి పురపాలకశాఖ తాజాగా మార్పులు చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్ నిధుల్లో 70 శాతం మేరకు పట్టణ, నగర స్థాయి పనులకు వినియోగించుకునేందుకు వీలుగా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 30 శాతం నిధులను ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిధిలోని వార్డుల స్థాయిలో వ్యయం చేయవచ్చని స్పష్టం చేశారు. గతంలో 50 శాతం నిధులు పట్టణ, నగరస్థాయి పనుల నిమిత్తం వ్యయం చేసేందుకు, మిగిలిన 50 శాతాన్ని వార్డుల్లో ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉండేది.
పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు అందిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు పురపాలక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పురపాలకశాఖ డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒక అధికారి సభ్యులుగా ఉంటారు.