Hit and Run New Law : న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారతీయ ప్రైవేట్ మజ్దూర్ మహా సంఘ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఐఆర్డీఏ పెంచిన వాహన బీమాను 50 శాతం తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ఆధ్వర్యంలో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేశారు. కొత్త చట్టం బిల్లును కాల్చివేశారు.
Drivers Protest against New Law : కేంద్ర ప్రభుత్వం బ్రిటీష్(British) కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పింది కానీ, నేడు డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చిందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ఆరోపించారు. కొత్త వాహన చట్టం ప్రకారం డ్రైవర్లకు రూ.7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని కేంద్రం అంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ డ్రైవర్ కూడా కావాలని యాక్సిడెంట్ చేయరన్నారు. ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్లకు సరిగ్గా బీమా(insurance) రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టంలో మార్పులు చేసిన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలు- అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం
'కేంద్ర ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పి, ఇవాళ చట్టాలను మార్పు చేస్తూ న్యాయ సంహిత (Law Code)రోడ్ యాక్సిడెంట్ బిల్లుపై చర్చించారు. దీనివల్ల డ్రైవర్లు ఏదైనా ప్రమాదానికి కారకులై, పోలీసులుకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళితే హిట్ అండ్ రన్ కేసుగా డ్రైవర్లకు రూ.7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంట్లో ప్రకటించారు. దీనిని భారతీయ ప్రైవేట్ మజ్దూర్ మహా సంఘ్ వ్యతిరేకిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చర్చలు జరిగిన తర్వాత లారీ డ్రైవర్ల సమ్మె విరమణపై స్పష్టత ఇస్తాం' - రవిశంకర్ , భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ప్రధాన కార్యదర్శి
Protest on Hit and Run Law : మరోవైపు హిట్ అండ్ రన్ కేసులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా మధిరలో లారీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మధిర డివిజన్ లారీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మధిర వైఎస్ఆర్ సర్కిల్లో పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లు, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న హిట్ అండ్ రన్ కేసులో రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
భాగ్యనగరంలో పెట్రోల్ కష్టాలు - దొరికిన వాడే హీరో
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు - క్యూ కడుతున్న వాహనదారులు