నిజాం ఏలుబడిలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేవారు కాదు. వాటిని సరిహద్దు ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన ఉండేది. సంబంధిత దుకాణాలను ఆబ్కారీశాఖ అధికారులు పర్యవేక్షించేవారు.
1862 సంవత్సరంలో న్యాయసచివాలయం ఏర్పాటైంది. నిజాం ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఇది కొనసాగేది. అదాలత్ -ఏ- ఫౌజ్‌దారీ, అదాలత్ -ఏ- దివానీ న్యాయస్థానాలనూ ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణకు అప్పటి నుంచే చర్యలు చేపట్టారు. అడవుల సంరక్షణ, ప్రకృతి సంపదను కాపాడేందుకు వీలుగా 1867లో అటవీశాఖ ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆయా కార్యక్రమాలను నిర్వహించేవారు.
1687 నుంచి 1763 వరకు హైదరాబాద్ నగరం రాజధాని హోదాను కోల్పోయింది.
మింట్ కాంపౌండ్‌లో ద్రవ్య స్థిరీకరణకు నాణేల ముద్రణ ప్రారంభించారు. ఆ నాణేలను ‘హలిసిక్కా’ అని పిలిచేవారు.
ఖైరున్నీసా పేరిట ఖైరతాబాద్
కులీకుతుబ్‌షా కుమార్తె ప్రిన్సెస్ ఖైరున్నీసాను తరచూ అనారోగ్యం ఇబ్బంది పెడుతుండేది. నైరుతి దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆమె ఆరోగ్యాన్ని చక్కదిద్దుతాయని భావించారు. ఇందుకు ఖైరతాబాద్ ప్రాంతాన్ని గుర్తించారు. 1570లో ఆమె కోసం ప్యాలెస్, పక్కన మంచినీటి సరస్సు, మసీదు నిర్మించారు. కాలక్రమంలో ఖైరున్నీసా పేరిట ఖైరతాబాద్‌గా పేరు స్థిరపడింది. సరస్సు హుస్సేన్‌సాగర్ అయింది.
140 ఏళ్ల చరిత్ర మోండా మార్కెట్ సొంతం
సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ అంటే తెలియనివారు ఉండరేమో! ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలితో దర్పానికి చిరునామాగా ఇది కనిపిస్తుంది. దీన్ని 1880లో బ్రిటిష్ సైనికుల అవసరాల కోసం ఏర్పాటు చేశారు. 1936లో ఏడో నిజాం పాలనలో నాలుగెకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.