HighCourt stay on Teachers Transfers : తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. ఈ నెల 19 వరకు స్టే విధిస్తూ హైకోర్టు (HighCourt) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు టీచర్లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పదోన్నతులు ఇచ్చిన తర్వాతే బదిలీలు చేయాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దొంతినేని బాలకిషన్‌రావు.. హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం బదిలీపై స్టే విధిస్తూ.. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
Teacher Promotions Postpone Telangana : ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి.. ఆ సంవత్సరమే నిబంధనలు విడుదల చేసింది. తాజా పదోన్నతుల్లో (Teacher Promotions) ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో టెట్ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియార్టీ జాబితాను సమర్పించాలని హైకోర్టు.. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి నివేదించింది.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మల్టీ జోన్-1తో పాటు మల్టీ జోన్-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అది ఇక జరగకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Teacher Promotions Postpone : ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పదోన్నతుల ప్రక్రియ (Teacher Promotion Telangana) ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఈ క్రమంలో టెట్ పాసై ఉపాధ్యాయ విధుల్లో చేరినవారి సంఖ్య రాష్ట్రంలో 15,000 మందికి ఎక్కువగా ఉండరు. కాగా అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లు అయ్యేవారు.
పదోన్నతికీ టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని తొలుత కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అనంతరం ఈ గడువును 2019 వరకు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇంకోసారి గడువు పెంచాలన్నా.. పార్లమెంట్ ఆమోదం చెయాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గడువు పొడిగించినా.. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావడం కష్టమవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
High Court Stay on Teachers Promotions in Telangana : టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే