హైదరాబాద్ పాతబస్తీలో పెట్రోల్ బంకు పక్కన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. పేట్లబుర్జులో పెట్రోల్ బంకు, ప్రసూతి ఆస్పత్రి మధ్య 2 వేల చదరపు గజాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నిర్మించవద్దని కోరుతూ... 2018లో మొయినుద్దీన్ ఖాన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. పనులపై స్టే జారీ చేసింది.
స్టే ఇచ్చినప్పటికీ...
హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. అధికారులు పనులు చేపట్టేందుకు ముందుకు వెళ్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పెట్రోల్ బంక్ లైసెన్స్ డిసెంబరుతో ముగియనుందని.. దాన్ని మరోచోటకు మారుస్తామని అదనపు ఏజీ రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. అన్ని ముందు జాగ్రత్తలతో పెట్రోలు బంకు నిర్మిస్తామని.. హైదరాబాద్‌లో పెట్రోల్‌బంకుల పక్కన 8 సబ్ స్టేషన్లు ఉన్నాయని.. ఎక్కడా ప్రమాదాలు జరగలేదని వివరించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం...
సబ్‌స్టేషన్ నిర్మించకపోతే పాతబస్తీలో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతాయని.. కాబట్టి అనుమతించాలని కోరారు. పెట్రోల్‌బంక్‌లో లేదా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం తలెత్తితే.. తీవ్ర నష్టం ఏర్పడుతుందన్న హైకోర్టు.. స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. పెట్రోల్‌బంక్ లైసెన్సు కాలపరిమితి ముగిసే వరకు ఆగాలని సూచించిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'కేంద్రం పైసలిస్తనంటే కేసీఆర్ వద్దన్నడు.. జగన్ ఆశపడ్డడు'