కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. బెయిల్, రిమాండ్, ఇంజంక్షన్ వంటి అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు, కక్షిదారులు, సాక్షుల హాజరు కోసం ఒత్తిడి చేయవద్దని.. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరితే అంగీకరించాలని స్పష్టం చేసింది. నిందితుల రిమాండ్ ప్రక్రియను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని పేర్కొంది.
వైద్య సలహాలు పాటించండి..
కక్షిదారులు కోర్టుకు హాజరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయవాదులను కోరింది. అత్యవసర చికిత్స కోసం కోర్టు సముదాయాల్లో తాత్కాలిక వైద్య సేవలను సమకూర్చాలని జిల్లా న్యాయమూర్తులను ఆదేశించింది. కోర్టుల్లోకి ప్రవేశించే వారందరికీ.. స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దగ్గు, తుమ్ము, జలుబుతో బాధపడుతున్న కోర్టు సిబ్బంది కచ్చితంగా వైద్య సలహాలు పాటించాలని స్పష్టం చేసింది. కోర్టుల్లో సబ్బులు, మాస్క్‌లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. బార్ అసోసియేషన్ హాళ్లను మూసివేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను పాటించాలని జిల్లా కోర్టులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
హైకోర్టు ముందస్తు జాగ్రత్తలు..
కరోనా ఆందోళనల నేపథ్యంలో హైకోర్టు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పనిదినాలు, కోర్టులను కుదించాలని నిర్ణయించింది. సోమ, బుధ, శుక్రవారం మాత్రమే పని చేయనుంది. ఒక డివిజన్ బెంచ్, నాలుగు సింగిల్ బెంచ్‌లు మాత్రమే కొనసాగుతాయి. ఈనెల 25న బుధవారం ఉగాది పండగ ఉన్నందున.. గురువారం పనిచేయనుంది. న్యాయమూర్తులు సహా హైకోర్టులోకి వెళ్లే వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
వారికి అనుమతి లేదు..
కేసు లేని న్యాయవాదులు, కక్షిదారులకు కోర్టు హాల్లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. కేసు ఉన్న న్యాయవాదులు కూడా విచారణకు ఐదు నిమిషాల ముందే హాలులోకి రావాలని తెలిపింది. స్టే ముగిసే కేసుల్లో... తదుపరి విచారణ వరకు పొడిగించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...