మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో సిద్దిపేట ప్రస్తుత కలెక్టర్ పి. వెంకటరామిరెడ్డి, గతంలో కలెక్టర్గా పనిచేసిన ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో జయచంద్రారెడ్డికి సింగిల్ జడ్జి విధించిన శిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2018లో ప్రాజెక్టు నివేదిక విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడంపై అధికారులకు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్డీవో జయచంద్రారెడ్డికి రెండు నెలల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా, కలెక్టర్లకు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ గతనెల 24న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఆర్డీవో, కలెక్టర్లు అప్పీళ్లు దాఖలు చేశారు.
దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చౌహన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్డీవో కోర్టు ఉత్తర్వులను అమలు చేశారని... ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్లు, ఆర్డీవోకు విధించిన శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సచివాలయం కూల్చొద్దు: హైకోర్టు