HC has directed DGP to submit a report on the CCTV footage: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలపై నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గత 9, 10 నెలలుగా సీసీ కెమారాల పనితీరు ఫుటేజీ భద్రపరచడంపై కోర్టు చెబుతుండడంతో పాటు 6 నెలలైనా ఫుటేజీని భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. పలు కేసుల్లో సీసీ కెమెరాలే పనిచేయడం లేదని చెబుతున్నారని కోర్టు పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో వరుస గోలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్థులను వేగంగా పట్టుకుంటున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో 40 శాతం పని చేయడం లేదని స్వయానా ఈ విషయం గురించి హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని గత ఏడాది ఎస్సై కొట్టాడని ఆరోపణకు సంబంధించి జిల్లా ఎస్పీని సీసీ కెమెరా ఫుటేజి సమర్పించాలని ఆదేశించింది. ఎస్సై కొట్టడంతో మాధవులు అనే వ్యక్తి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా మెడికో లీగల్ కేసు నమోదు చేయడానికి నిరాకరించగా, బాధితుడు ఎస్పీకి వినతి పత్రం సమర్పించాడు. వినతి పత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా చర్యలు చేపట్టకపోవడంతో ఎస్పీ మనోహర్‌పై కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై కోర్టు విచారణ చేపట్టి ఉత్తర్వలు వెలువరించింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో పిటిషనర్‌కు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించామని, ఎస్పీ బిజీగా ఉండడంతో డీఎస్పీకి, డీఎస్పీ.. సీఐకి ఇలా విచారణ బాధ్యతను సహ ఉద్యోగికి అప్పగించడాన్ని చూస్తే బాధితుడికి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదంది. బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు ఎస్సై కొట్టాడని చెబుతున్నాడు.
అలాంటి సమయంలో సీసీ కెమెరాల ఫుటేజీ ఎందుకు తీసుకోలేదో అర్ధం కావడం లేదంది. సీసీ కెమారాల గురించి అడిగితే కెమెరాలు పనిచేయడం లేదంటున్నారని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించి సీసీ కెమెరాల ఫుటేజీలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 10 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అదే తేదీ నాటికి రాష్ట్రంలో సీసీ కెమెరాల ఫుటేజీల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని డీజీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: