దేవరయాంజల్ భూముల్లో సర్వే కోసం ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవో 1014ను కొట్టివేయాలని కోరుతూ స్థానికుడు సదా కేశవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్ ఇవాళ విచారణ చేపట్టారు. కమిటీ తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖాళీ చేయించడం లేదా ఇతర వ్యతిరేక చర్యలు చేపట్టకుండా.. కేవలం విచారణ జరిపితే ఇబ్బందేంటని పిటిషనర్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా.. ఆక్రమణదారులను కబ్జాలు చేసుకోనీయమంటారా అని వ్యాఖ్యానించింది. అయితే అధికారులు చాలా మంది సిబ్బందితో వస్తున్నారని.. ముందుగా కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ఐఏఎస్‌ల కమిటీకి విచారణ జరిపే స్వేచ్ఛ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే భూముల్లోకి ప్రత్యక్షంగా వెళ్లినా, వ్యతిరేక చర్యలు చేపట్టినా.. ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు అవసరమైన సమాచారం, దస్త్రాలను కమిటీకి ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఒకవేళ పిటిషనర్లు విచారణకు సహకరించకపోతే.. కమిటీ చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: Kaleshwaram: కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకిన గోదావరి పరవళ్లు