గత కొద్ది రోజులుగా హైదరాబాద్ శివారులో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 1762 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది. దీంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ అప్రమత్తం చేశారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో హిమాయత్‌సాగర్ నీటిమట్టం 1763 అడుగుల స్థాయికి చేరితే ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఎండీ ప్రకటించారు.