ఈ ఏడాది మే 19 వరకు రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకుంటే ఈ నెలలోనే అత్యధికంగా పది రోజుల పాటు వడగాల్పులు నమోదయ్యాయి. ఏప్రిల్లో 6 రోజులు ఇదే పరిస్థితి. మే 11 ఈ ఏడాది 'కాక పుట్టించిన రోజు'గా రికార్డుకెక్కింది. ఆ రోజు 11 జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో వడగాడ్పులు నమోదైన జిల్లాల్లో జగిత్యాల ముందుంది. ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. వేసవి కాలం పోయి వాతావరణం చల్లబడేందుకు ఇంకో 20 రోజుల సమయం పడుతుండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ప్రతి ప్రాంతానికి సాధారణ ఉష్ణోగ్రత రికార్డు ఉంటుంది. రెండు రోజులపాటు సాధారణ ఉష్ణోగ్రతను దాటి అదనంగా 4.50 డిగ్రీల సెల్సియస్ నమోదైతే ఆ ప్రాంతంలో వడగాడ్పులు నమోదైనట్లుగా పరిగణిస్తారు. ఇదే తీరుగా ఓ ప్రాంతంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు నమోదైనా వడగాడ్పుగానే లెక్కిస్తారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే సంస్థలు వీటిని ఎప్పటికప్పుడు గణిస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ, హైదరాబాద్ వాతావరణ శాఖలు రోజూవారి వాతావరణ వివరాలను వెల్లడిస్తున్నాయి. గాలిలోని తేమ శాతం ప్రభావితమైనా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రిపూట గాలిలో తేమ శాతం పెరిగి చల్లదనం ఏర్పడుతుంది. దీనికి భిన్నంగా పగటిపూట వేడికి గాలిలో తేమ ఆవిరైపోయి రాత్రిపూట కూడా ప్రభావం చూపుతోంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల తరవాత ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మేలని అధికారులు సూచిస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు వేడి నుంచి ఉపశమనానికి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్