మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీ. ఈకార్తె తొలి రోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందనే విశ్వాసం సంప్రదాయంగా వస్తోంది. చేపలు తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజల ప్రబల నమ్మకం. మత్స్యాలను తింటే రోగనిరోధకశక్తి పెరిగి జ్వరం, దగ్గు, శ్వాససంబంధ సమస్యలు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. రోహిణి కార్తెలో ఎండలతో సతమతమయ్యే జీవకోటికి... మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో ఉపశమనం కలుగుతుంది.
మార్కెట్లలో రద్దీ
మృగశిర కార్తె వేళ చేపలు తినాలన్న ఉద్దేశంతో తరలి వచ్చిన జనంతో భాగ్యనగరంలోని మార్కెట్లు, రైతుబజార్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ రాంనగర్‌లోని చేపల మార్కెట్ భారీగా వచ్చిన కొనుగోలుదారులతో కిటకిటలాడింది. జలపుష్పాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మృగశిర కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున సరుకు తెప్పించి విక్రయాలు చేపట్టారు. వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, రోహు, బొచ్చ, కట్ల, తిలాపియా, సీర్, సోల్మన్, రవ్వ, కింగ్‌ఫిష్, చందమామ, బండగ, తున, రెడ్ స్నాప్పర్, బెంగాల్ క్రాప్, పింక్ పెర్చ్, బ్లూకర్బ్స్, రొయ్యలు వంటివన్నీ అందుబాటులో ఉంచారు.
నిబంధనలు గాలికొదిలేశారు..
చాలా దుకాణాల వద్ద ఎడం పాటించకపోవడం కనిపించింది. భౌతిక దూరం, కరోనా నిబంధనలు పాటించని 70 మంది దుకాణ యాజమానులకు పోలీసులు జరిమానా విధించారు. బేగంబజార్ మార్కెట్‌లోనూ కొనుగోలుదారుల సందడి కనిపించింది. లాక్‌డౌన్ నిబంధనల వల్ల జనం చేపల కోసం ఎగబడ్డారు. కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్ రోడ్ చేపల మార్కెట్ల వద్ద రద్దీ కనిపించింది.
జోరుగా కొనుగోళ్లు
జిల్లాల్లోనూ చేపల కొనుగోళ్లు జోరుగా సాగాయి. వరంగల్‌లోని ప్రధాన మార్కెట్లలో రద్దీ నెలకొంది. చేపలు కొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖమ్మం డిపో రోడ్డు, బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ కూడలి వద్ద కొనుగోళ్లు భారీగా సాగాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తెల్లవారుజాము నుంచే ప్రజలు చేపల కోసం క్యూకట్టారు. సాధారణ రోజుల కంటే అధిక రేట్లకు కొనాల్సివచ్చిందని వినియోగదారులు వాపోయారు.
కిటకిటలాడిన విక్రయ కేంద్రాలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేపల విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. భారీగా వ్యాపారం జరిగిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. మంథనిలో చెరువుల వద్దకే ప్రజలు వెళ్లి తాజా చేపలను కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు అధిక మొత్తంలో తీసుకెళ్లారు. చెరవుల్లోని చేపలన్ని అమ్మడుపోయిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. కొనుగోలుదారులు భౌతికదూరం పాటించకపోవడంతో... కరోనా వ్యాప్తికి ఎక్కువగా ఆస్కారం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది కట్టడి చేసినా కొందరు నిబంధనలు పాటించ లేదు.
ఇదీ చదవండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు