రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురిసింది. సికింద్రాబాద్, వారాసీగూడల్లో రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది. వర్షం ధాటికి అఫ్జల్ సాగర్ వద్ద ఓ పాత భవనం బాల్కనీ కూలిపోయింది. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణపాయం జరగలేదు. ముషీరాబాద్‌లోని గణేశ్‌నగర్‌లో వరద ప్రవాహానికి పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. బాపూజీ నగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి పెద్ద ఎత్తున నీరు చేరగా అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా తొలగించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులో జాతీయ రహదారిపై భారీ వర్షానికి కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నారావుపేట మండలం జోజిపేట నారాయణ తండాలో పిడుగుపాటుకి భధ్రు అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయబావి వద్ద నారుమడి దున్ని తిరిగివస్తుండగా పిడుగుపడింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో ఓ ఇంట్లో పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
రహదారులు జలమయం
ఖమ్మం నగరంలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వానలకు రహదారులు నదులను తలపించాయి. మురుగు కాలువలు పొంగి పోర్లాయి. మయూరి కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలు వరద ప్రవాహానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కవిరాజనగర్, చెరువు బజార్, సారథినగర్, మోతీనగర్, ప్రకాశ్ నగర్, పాండురంగాపురంలోని ఇళ్లలోకి నీరు చేరింది. కరీంనగర్‌లోని జ్యోతి నగర్, రాంనగర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. బాలాజీ నగర్‌లో లోతట్టు ప్రాంతాలను మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పరిశీలించారు. జగిత్యాలలో మంచినీళ్ల బావి, టవర్ సర్కిల్, మార్కండేయ కాలనీలో డ్రైనేజీలు పొంగి పొర్లాయి.
జోరు వాన
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరు వాన పడింది. రామన్నపేటలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనంపల్లి శివారులోని కక్కిరేణి రోడ్డుపై నీరు పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రామన్నపేట సామాజిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం చెరువును తలపించింది. వలిగొండ మండలం దుప్పల్లిలో పిడుగుపడి గేదె చనిపోయింది. చిన్నకందుకూర్ వద్ద జాతీయ రహదారిపై వర్షం పడుతున్న సమయంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయలయ్యాయి. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవటంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు..!