Rains in Telangana : రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. వరద జోరు మాత్రం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి విడుదలైన నీటికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవటంతో ప్రవాహ ఉద్ధృతిలో జోరు కనిపిస్తోంది. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువన గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.
Telangana Rain Problems 2023 : కామారెడ్డి జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోంది. నిజాంసాగర్ 10 టీఎంసీలకు చేరడంతో ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయన్న సూచనతో కలెక్టర్ జితేశ్ పాటిల్ క్షేత్రస్థాయిలో పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినా.. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగు పారుతోంది. బయ్యారం పెద్ద గుట్టపై నుంచి జాలువారుతున్న నీటిలో యువత కేరింతలు కొడుతోంది. గూడూరు మండలం లోని భీముని పాదం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతం అందాలు చూసి పర్యాటకులు పరవశించిపోయారు.
Heavy Water Flood Flow to Himayatsagar : హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు 7 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం దృష్ట్యా హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేశారు. స్థానికులు తరలివచ్చి సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తి వేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబర్‌పేటలోని ముసారాంబాగ్ వంతెన వద్ద మూసీ ప్రవాహ తాకిడి పెరిగింది. ముంపు సమస్య తలెత్తకుండా సమీప బస్తీ ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న జీవంగి వాగు.. దేవాలయం చుట్టూ చేరిన వరద నీరు : భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు మధ్యలో ఉన్న శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయం చుట్టూ వరద నీరు చేరింది. ఆలయంలోకి భక్తులు వెళ్లటానికి వీలులేకుండా నీరు ప్రవహిస్తోంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని మెడోస్ విల్లాస్ కాలనీని మురుగు నీరు ముంచెత్తిందని స్థానికులు వాపోతున్నారు. కొత్తకుంట, చెన్న చెరువుల నుంచి వస్తున్న వరద వల్ల సమస్య తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. పదెకరాలున్న కొత్త కుంట చెరువు ఆక్రమణల వల్ల మూడెకరాలకు కుచించుకుపోయిందని.. అందుకే ముంపు బారిన కాలనీలు పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Rains in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఇంకా మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పరిగిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నస్కల్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కుల్కచర్ల మండలం బోత్యానాయక్ తండాలో, యాలాల మండలం విశ్వనాథ్పూర్లో 5 ఇల్లు దెబ్బతిన్నాయి. సంగెంకాలన్ గ్రామ సమీపంలోని వాగులో గల్లంతైన పెంటప్ప కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతగిరిలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుట్టపై ఉన్న జలపాతం వద్ద పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్లలోని ఈసీ వాగు పరివాహక ప్రాంతాల్లో కూరగాయ పంటలు నీటమునగడంతో ఆర్థికంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: