అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దవుతోంది. ఉదయం నుంచే భారీ నుంచి అతి భారీ వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా వరదనీరు చేరుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నారావుపేటలో 14 సెంటిమీటర్ల భారీ వర్షపాతం నమోదయింది. వరంగల్- భూపాలపట్నం జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోతపోయడంతో జనావాసాలన్ని జలమయమయ్యాయి. పత్తి పంటలో నీరునిలువగా, మొక్కజొన్న పంటలు నేలకువాలాయి.
రహదారిపైకి మురికి నీరు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయయ్యాయి. పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, కమాన్ ప్రధాన రహదారి మురికి నీటితో నిండిపోయింది. పాత బస్టాండ్ వద్ద ఇటీవలే 50 లక్షలతో మురికి కాలువల మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారులోని సండ్ర వాగు ప్రాజెక్టు నిండి అలుగు దూకడంతో తంగళ్లపల్లి - లక్ష్మీపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ వర్షపాతం నమోదయింది.
వాగులో చిక్కుకున్న భక్తులు, రైతులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసాయి. వర్షపు నీటిత లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భీమేశ్వర ఆలయం ఎదుట నుంచి పారే వాగు ఉప్పొంగడంతో అటుగా వెళ్లిన 23మంది భక్తులు, రైతులు వాగులో చిక్కుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సహాయంతో గంట పాటు శ్రమించి వారిని రక్షించారు.
అలుగు పారుతున్న చెరువు
సంగారెడ్డి జిల్లాలో కురిసిన వానలకు సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు నిండింది. అలుగు నుంచి నీరు పారుతోంది. ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం అడ్డగుడూరు, ధర్మారం చెరువులు కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, మీర్‌పేట, బడంగ్‌పేట్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, బోయినపల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో వర్షం వాన పడింది.
సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం
సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: Rain Alert: రాష్ట్రంపై అల్పపీడన ప్రభావమెంత? వాతావరణ శాఖ ఏం చెబుతోంది?