Heavy rains in Hyderabad: నడి వేసవిలో హైదరాబాద్ మహానగరంలో కుండపోత వాన ముంచెత్తింది. పలుచోట్ల రహదారులు... కాల్వలను తలపించాయి. ముంచెత్తిన వరదనీటితో కాలనీల్లోని జనం ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ నియోజకకవర్గంలోని రామ్‌నగర్, ముషీరాబాద్, అడిక్ మెట్, కవాడీగుడా, బోలకపూర్, గాంధీనగర్ డివిజన్‌లోని బస్తీల్లో మోకాలి లోతులో నీళ్లు ప్రవహించాయి. మల్లేపల్లిలో వరదనీటితో రోడ్లపై భారీగా వరద చేరింది. పద్మ కాలనీలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కార్లు, బైక్‌లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ రహదారి, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద భారీగా నీరు నిలిచింది. బోడుప్పల్ లోని సాయిభవానీ నగర్ కాలనీలో నాలా పొంగి ప్రజలు అవస్థలు పడ్డారు. నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద వర్షపు నీరు, డ్రైనేజ్ పొంగిపొర్లి సిబ్బంది రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్ నిలయం అండర్ పాస్‌లో వర్షపు నిలిచిపోయి వాహనదారులకు కష్టాలు పడ్డారు. నాచారం కూడలి, తార్నాక, మలక్‌పేటలో రహదారిపై వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ కింద నీరు నిలిచిపోయింది. షేక్ పేట, మెహదీపట్నం, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మోకాళ్ల లోతులో నీళ్లు ప్రవహించాయి. సికింద్రాబాద్‌లోని చిలకానగర్‌లోని మల్లికార్జున్ నగర్ కాలనీలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
వర్షంతో భక్తులకు ఇక్కట్లు.. యాదాద్రి భువనగిరిలో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా గంటపాటు మెరుపులు, ఉరుములు కూడిన వర్షం పడింది. దీంతో అక్కడి ఆలయ వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఉదయాన్నే నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. మరోవైపు ఆలేరు సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఇవీ చదవండి:
- Girl falls in nala: పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు
- Mango Crop price in TS: మామిడి పంట ధర దిగాలు.. రైతన్న కుదేలు
- Crop Damage: నట్టేట ముంచుతున్న వర్షాలు.. రైతు కష్టమంతా నీటిపాలు
- REVANATH on ORR: 'రూ. 1000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం'