బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు.
నగరంలోని హైదర్‌గూడ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్, సూరారం, జీడిమెట్ల, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడం వల్ల వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు..
మరోవైపు రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: Minister KTR: హైదరాబాద్‌లో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నాం