హైదరాబాద్ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులు, కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారాంబాగ్-అంబర్ పేట్‌కు వెళ్లే వంతెన రోడ్డును, గడ్డి అన్నారం నుంచి సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్, సైదాబాద్ , సరస్వతి నగర్ , శివగంగ రోడ్డు, ఐఎస్ సదన్‌కు వెళ్లే రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.
సరూర్‌నగర్ చెరువు లోతట్టు ప్రాంతాలైన గడ్డి అన్నారం , శారదా నగర్, కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీల్లో నివాసాలలోకి వరద నీరు చేరడం వల్ల తాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక రాత్రి నుంచి వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కర్మన్‌ఘాట్, గ్రీన్‌పార్క్ కాలనీ, ఐఎస్ సదన్ డివిజన్, సింగరేణి కాలనీ , రెడ్డి కాలనీవాసులు ఇళ్లలోనే ఉండిపోయారు. అపార్టుమెంట్ వాసులకు ట్రాక్టర్ ద్వారా అల్పాహారం అందించారు. తమ గోడు పట్టించుకునే వారే కరవయ్యారని కోదండరాం నగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. చంపాపేట్ డివిజన్ రాజ్‌రెడ్డి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల కొంత మంది ఇళ్లు వదిలిపెట్టి వెళ్లగా... మరికొంత మంది స్థానిక ఫంక్షన్‌హాళ్లలో తలదాచుకున్నారు.
ఇవీ చూడండి: దెబ్బతిన్న ఇళ్లకు దసరా తర్వాత పరిహారం: కేటీఆర్