అనుమతి లేకుండా నిర్మిస్తే ఏడంతస్తుల భవనమైనా తునాతునకలే. అరగంటలో ఆ నిర్మాణాలు నేలమట్టం అవుతాయి. భారీ హ్రైడాలిక్ యంత్రాలు నిమిషాల్లో పని పూర్తిచేస్తాయి. అక్రమ నిర్మాణాల అంతు చూడటమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ వాటిని సమకూర్చుకుంది. ప్రణాళిక విభాగం తాజాగా ఈ యంత్రాలను రంగంలోకి దింపింది. శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్‌లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో జోన్ పరిధిలోని 50కిపైగా భవనాలను నేలమట్టం చేశామని, క్రమంగా అన్ని జోన్లలో ముమ్మర కూల్చివేతలు మొదలవుతాయని ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు పాక్షికంగా.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ రకరకాల యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించింది. పాక్షికంగా గోడలను కూలదోసి స్లాబుకు రంధ్రాలు వేసేవారు. వాటినే కఠిన చర్యలని ప్రకటించేవారు. ప్రస్తుతం వినియోగిస్తున్న కొత్త యంత్రాలు కత్తెరతో మొక్కలను కత్తిరించినట్లు.. స్లాబును, పిల్లర్లను, గోడలను తునకలు చేస్తాయి. మాదాపూర్ గురుకుల ట్రస్ట్ భూముల్లో భారీ అక్రమ నిర్మాణాలు ఇంకా మిగిలి ఉన్నాయని, మూడు రోజుల్లో వాటిని ఈ యంత్రాలను ఉపయోగించి కూల్చుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి : 60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన