Gutha Reaction on MP komatireddy Comments : రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని.. హంగ్ వస్తుందని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంకట్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని.. ఆ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో హంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. మంచి మెజార్టీతో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ మేరకు ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే టికెట్ల కేటాయింపులో సర్వేల ప్రకారమే సీఎం కేసీఅర్ నిర్ణయం ఉండొచ్చునని గుత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. షెడ్యుల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానన్నారు. కేంద్రం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పని చేస్తుంది తప్ప.. సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు. ఆ పార్టీ నేతలు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని విమర్శించిన ఆయన.. ప్రతిపక్షాలను, మీడియాను అణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
''కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి మెజార్టీతో తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టికెట్ల కేటాయింపులో సర్వేల ప్రకారమే కేసీఅర్ నిర్ణయం ఉండొచ్చు. షెడ్యుల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలు రావు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నా.'' - గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
అసలు వెంకట్‌రెడ్డి ఏం అన్నాడంటే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజార్టీ రాదని కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. సర్వేల ఆధారంగానే ఈ విషయాన్ని చెబుతున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించారు. ఆ వ్యాఖ్యలను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.
ఇవీ చూడండి..
రాబోయేది 'హంగ్ అసెంబ్లీ'.. KCR మాతో కలవాల్సిందే : ఎంపీ కోమటిరెడ్డి
'ఆ వ్యాఖ్యలు ఠాక్రే పట్టించుకోలేదు.. వేరే విషయాలు చర్చించాం'