gutha sukender reddy fires on bandi sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన అధికారిక పర్యటనా..! లేదంటే పార్టీ కార్యక్రమమో అర్ధం కాలేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని పర్యటనపై నల్గొండ పట్టణంలోని తన నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రసంగం తెలంగాణ సమాజాన్ని నిరుత్సాహపరిచిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో చెప్పలేక మోదీ విషపూరిత ప్రసంగం చేసి వెళ్లారన్నారు. టోల్ ట్యాక్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్న అయన.. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నారు. ఒక్క తెలంగాణ నుంచే 1400 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ వసూలు చేసిందన్నారు.
తెలంగాణకు చేసిన లబ్ధి ఏంటో చెప్పాలి: 14 కొత్త జాతీయ రహదారుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు వాటి ఊసెత్తడం లేదన్న గుత్తా.. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల మధ్య జాతీయ రహదారి కావాలని కేంద్ర మంత్రికి లేఖ రాశానన్నారు. కానీ, ఇప్పటి వరకు దానికి సమాధానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన లబ్ది ఏంటో చెప్పాలన్నారు. ధరలు పెంచడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ట్యాక్సులు పెంచడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేసీఆర్ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని.. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కక్ష్యపురితంగా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఓర్వలేకే ఇవన్నీ: రాష్టానికి చెందిన రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు అక్కరకు రాని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక 2 జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే శ్రీరామ రక్ష అన్నారు. రెండు జాతీయ పార్టీల నాయకులు అధికారంలోకి వస్తాం అని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి నిరోధకులుగా వారు: గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి అంటే కేంద్రం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. స్కాములు, మోసాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న వారు బీజేపీ పార్టీలో చేరగానే పునీతులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కడానికే ఈడీ, ఐటీ దాడులు జరుతున్నాయన్నారు. రాష్ట్ర గవర్నర్ తీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉందన్న అయన.. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, వారు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఉద్దేశ్య పూర్వకంగానే ఆపినట్లు కనిపిస్తుందన్నారు.
"ప్రధాని కార్యక్రమం అధికారిక కార్యక్రమం. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి సంబంధంలేదు. ఆయన బహిరంగంగా సీఎంకి ప్రత్యేకంగా మేము కుర్చీ వేశాము. ఆయన ప్రసంగానికి 7నిమిషాలు కేటాయించాము. శాలువా కప్పుదామనుకున్నాము అని అనటానికి ఆయన ఎవరు.. ఆయనకేంటి సంబంధం. అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడిగా హాజరయ్యే అవకాశం ఉంది కానీ, ఆయన డయాస్ నిర్వహణ కానీ, ఆయన ఆహ్వానించే వాడే కానీ, ఆయనకు సంబంధంలేని విషయం. 11వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. దానిలో జాతీయ రహదారులకి సంబంధించే తప్పా మరొకటి పెద్దగా ఎక్కడా కనపడలేదు."_గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్
ఇవీ చదవండి: