రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనుంది. schooledu.telangana.gov.in వెబ్సైట్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా వివరాల నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, సిబ్బంది బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు తప్పనిసరి చేసింది.
ఈ వివరాలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారుల ద్వారా డీఈవోలు తనిఖీ చేయించనున్నారు. అనంతరం ధ్రువీకరించుకున్న వివరాలను కలెక్టర్ల ద్వారా విద్యాశాఖకు పంపనున్నారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు పాఠశాలల నుంచి వివరాల సేకరణ ప్రక్రియ సాగనుంది. 16 నుంచి 19 వరకు వివరాల తనిఖీ, క్రోడీకరణ జరగనుంది. ఈ నెల 20 నుంచి 24 వరకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుండగా.. 21 నుంచి 25వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నారు.
విద్యాశాఖ వద్దనున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని దాదాపు 11వేల ప్రైవేటు పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 1.45 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో బోధనేతర సిబ్బంది 27వేల మందిగా తేలింది. ఆర్థిక సహాయం పొందగోరే సిబ్బంది ఎంపికకు విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రైవేటు పాఠశాలల సిబ్బంది బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ల నుంచి సమాచారం అందాక ఆర్థికశాఖ నేరుగా సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.2000 వంతున జమచేస్తుంది.
జాబితా తయారుచేసేది హెచ్‌ఎం
- ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది ఎవరెవరు పనిచేస్తున్నారో ప్రధానోపాధ్యాయులు జాబితా తయారుచేయాలి. విద్యాశాఖ ఫార్మాట్‌లో సమాచారం నింపి ఎంఈవోకు ఇవ్వాలి.
- పార్ట్-ఏలో సిబ్బంది ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్యలు, ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ సంఖ్య, ఆహార భద్రత కార్డు ఉంటే ఆ సంఖ్య, రేషన్ షాపు ఉన్న ప్రాంతం వివరాలు నింపి ఉపాధ్యాయుడు/సిబ్బంది సంతకం చేయాలి.
- పార్ట్-బిలో పాఠశాల వివరాలను ప్రధానోపాధ్యాయుడు నింపాలి. వాటిని ఎంఈవో లేదా కలెక్టర్ నియమించిన అధికారి పరిశీలించాలి. డీఈవో, కలెక్టర్ సంతకాలతో విద్యాశాఖకు పంపిస్తారు.
- పాఠశాలల వివరాలతో కూడిన పార్ట్-బిలో రాష్ట్ర బోర్డు(ఎస్‌ఎస్‌సీ)తో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర అని పొందుపరిచారు. అంటే రాష్ట్ర సిలబస్‌తో పాటు ఇతర బోర్డుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా అర్హులే. కాకపోతే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ తప్పనిసరి.
- వివరాలు నిజమో? కాదో? పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్లలో కలెక్టర్లు ఆయా కమిషనర్లు, వారి సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.
ఆర్థిక సాయానికి కాలపట్టిక
- ఈనెల 10-15 వరకు : అన్ని పాఠశాలల నుంచి వివరాల సేకరణ
- 16న : జిల్లా స్థాయిలో వివరాల తనిఖీ
- 17-19 : రాష్ట్ర స్థాయిలో వివరాల తనిఖీ, తుది రూపం ఇవ్వడం
- 20-24 : ఎంపికైన వారికి ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ
- 21-25 : రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల వంతున సన్నబియ్యం సరఫరా.
ఇదీ చూడండి: ఈనెల నుంచే ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం: మంత్రులు