కొవిడ్ బారిన పడిన ఫ్రంట్‌లైన్ యోధుల వివరాలను, ప్రజల కోసం అమరులైన వారి జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌తో జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. వైద్యులు, పారా మెడికల్, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులతో సహా ఫ్రంట్‌లైన్ యోధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందడం లేదని ఆరోపించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల 'ఆరోగ్య భద్రత పథకం' కింద పోలీసు సిబ్బందికి ఉచిత చికిత్స అందడం లేదని విమర్శించారు. ఫ్రంట్‌లైన్ యోధులకు అందుతున్న సౌకర్యాలను తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ ఒక్క సమావేశం నిర్వహించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్న ఫ్రంట్‌లైన్ యోధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారిని అమరవీరులుగా గుర్తించడానికి ఎందుకు ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'వెయిటేజీ చట్టబద్ధమే.. కానీ 20 శాతానికి మించరాదు'