Online Pindi vantalu : సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది పసందైన విందు భోజనం. రకరకాల పిండి వంటలు. పండగ పదిరోజుల ముందే ప్రతి ఇంటా పొయ్యి వెలుగుతుంది.. ఇప్పుడు ఇదంతా మారిపోతోంది. నగర జనం నెట్టింటిపై ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డరిచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగిపోతున్నారు. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు.
గృహిణులకు కలిసొస్తోంది..
ఇంటి బాధ్యతలు అయిపోయాక ఖాళీగా ఉండలేక పిండి వంటల తయారీని వ్యాపార మార్గంగా ఎంచుకుంటున్నారు నగర గృహిణులు. కొవిడ్ సమయంలోనూ చాలామందికి ఇంటిని పోషించేందుకు ఆదాయ వనరుగా ఉపయోగపడింది. ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు యూఎస్, యూకే, కెనడా, సింగపూర్, తదితర దేశాల నుంచి వస్తుండటంతో.. వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల నుంచి చెక్కల వరకు, గారెల నుంచి అరిసెల దాకా, లడ్డూలు, వడప్పలు ఇలా ఒక్కో దానికి కిలోకు రూ.300-350 దాకా తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
రెండు నెలల ముందే..
విదేశాల్లో ఉన్న తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. చిరుతిళ్లు చేసేందుకు అక్కడ సరైన ముడిసరకులు, వనరులు లేకపోగా ఎక్కువ మంది ఉద్యోగాలతో తీరిక లేనివారే. వారందరికీ దిక్కు నగరమే. ఇక్కడ చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాలు దాదాపు లక్షకు పైగా ఉన్నాయి. వీరంతా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయగానే.. ఇక్కడ తయారీదారులు కొరియర్ సర్వీసులకు అందించి ట్రాకింగ్ లింకును కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. 2020తో పోల్చితే ఈ ఏడాది 40శాతానికి పైగా ఆర్డర్లు పెరిగాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు రాబోతున్నాయనే భయంతో దాదాపు 2, 3 నెలల ముందుగానే ఆర్డర్లు పెట్టినవారూ చాలామందే ఉన్నారని తయారీదారులు చెబుతున్నారు.
ఈ సారి ఎక్కువ వ్యాపారం
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆర్డర్లు భారీగా పెరిగాయి. యూఎస్, యూకే తదితర విదేశాల నుంచి పిండి వంటలకు ఆర్డర్లిస్తున్నారు. పదేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నాం. ఈ ఏడు పెరుగుదల కనిపించింది. కొవిడ్ నష్టాలన్నీ ఈ రెండు నెలల గిరాకీ పూడ్చుతుంది. - అక్కినపల్లి రమేశ్, కాచిగూడ
ఇదీ చూడండి: Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ