లాక్డౌన్ వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బడుగులకు కొందరు పాత స్నేహితుల బృందం చేయూతనిచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన గాంధీనగర్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శంకర్రావు అప్పలనాయుడుతో పాటు 2002-03 పదో తరగతి మిత్రులందరూ కలిశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు సమీపంలో ఉండే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకలిని గుర్తించారు.
దాదాపు అరవై మంది మిత్ర బృందం డబ్బులు పోగు చేసి... బియ్యం, కందిపప్పు, కూరగాయలు, గోధుమపిండి , నూనె, శానిటైజర్, రెండు రకాల పండ్లతో కలిపి 15 రకాల ఆహార పదార్థాలు అందించాలని నిర్ణయించుకున్నారు. తమ ఆలోచనలు అమలు చేసేందుకు గానూ పోలీసుల సాయం తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే పేదలకు సరుకులను పంపిణీ చేశారు. నాటి మిత్ర బృందం చేస్తోన్న సేవ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.